ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక జల ప్రాజెక్టుల పురోగతిని, నిధుల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా పోలవరం, జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
రాష్ట్రంలో రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార’ పథకం వివరాలను చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఈ కొత్త పథకం ద్వారా మరో 27 లక్షల కుటుంబాలకు నీటి కనెక్షన్లు అందించడమే లక్ష్యమని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.










