🎤కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):
కాగజ్నగర్: ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ మరియు భారతీయ రైల్వేల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి రైలు ఆసుపత్రి ‘లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్’ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హరిత రైలును సందర్శించి, అందులోని ఉచిత వైద్య విభాగాలు మరియు అత్యధునిక ఆపరేషన్ థియేటర్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులు, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులతో సమావేశమై రోగులకు అందించే సేవలపై పలు కీలక సూచనలు చేశారు.
20 రోజుల పాటు ఉచిత సేవలు – కలెక్టర్ కే. హరిత
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల అక్టోబర్ 16 నుండి నవంబర్ 5 వ తేదీ వరకు మొత్తం 20 రోజుల పాటు కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ద్వారా ఉచిత ఔట్ పేషెంట్ (OP) వైద్య సేవలతో పాటు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా పేద రోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వైద్య సేవల కోసం వచ్చే నిరుపేద రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అందించే ఉచిత వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు:
కంటి పరీక్షలు మరియు ఉచిత శుక్లాల (Cataract) ఆపరేషన్లు, పిల్లలకు సంబంధించిన ఎముకల వ్యాధులు, కాళ్ల వైకల్య సవరణ శస్త్రచికిత్సలు (పోలియో, క్లబ్ఫుట్ మొదలైనవి, చెవి, ముక్కు, గొంతు (ENT) సమస్యల చికిత్స మరియు ఆపరేషన్లు, గ్రహణ మొర్రి (Cleft Lip) మరియు కాలిన గాయాల, దంత సమస్యలకు ఉచిత చికిత్సలు.
ఈ కార్యక్రమంలో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ నిర్వాహకులు డాక్టర్ మనోహర్ రెడ్డి, రైల్వే పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










