కీసర టోల్‌గేట్ సమీపంలో ఘోర ప్రమాదం.. బాధితుడిని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే తాతయ్య
నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz
కంటైనర్ లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన విషాద ఘటన కీసర టోల్‌గేట్ సమీపంలో చోటుచేసుకుంది. నందిగామ మండలం చందాపురం గ్రామానికి చెందిన కనకపూడి కోటేశ్వరరావు (30) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య(రాజీ ), ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కోటేశ్వరరావు ఆటోలో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టినట్లు సమాచారం. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రమాద సమయంలో విజయవాడ నుంచి జగ్గయ్యపేట వైపు వెళ్తున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) ప్రమాద బాధితుడిని గమనించి వెంటనే ఆగారు. అంబులెన్స్‌కు ఫోన్ చేసి క్షతగాత్రుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అయితే, అప్పటికే కోటేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










