మంచిర్యాల జిల్లా : ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సర్వే అండ్ ల్యాండ్ ఏడీతో కలిసి మండల సర్వేయర్లకు ప్రభుత్వం జారీ చేసిన 14 రోవర్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూ రీసర్వే నిర్వహించే సమయంలో పాత రెవెన్యూ రికార్డులు, పహాణీలు, సెత్వార్, టిప్పన్, ఎఫ్ఎంబీ, గ్రామ నక్షాలు, సర్వే నంబర్లు, భూముల విస్తీర్ణం, సబ్ డివిజన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులతో సరిపోల్చుకుంటూ సర్వే చేపట్టాలని తెలిపారు.
భూ రీసర్వేలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (DGPS), రోవర్లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS), క్యూ జీఐఎస్ (QGIS) వంటి సాంకేతిక పద్ధతుల ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలని పేర్కొన్నారు.
భూ రీసర్వే అనేది కేవలం భూముల కొలతలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదని, భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా ప్రతి భూ యజమానికి భద్రమైన హక్కులు కల్పించే కీలక కార్యక్రమమని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం మండల సర్వేయర్లకు ప్రభుత్వం జారీ చేసిన 14 రోవర్లను అందజేశారు.










