కోర్టు కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ మార్గం

0
3

🟢పరస్పర అంగీకారంతో సమస్యలకు పరిష్కారం

🟢కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులకు చెక్

నందిగామ, అక్టోబర్ 9, bharat aawaz :

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం (మీడియేషన్) ఉత్తమ మార్గమని నందిగామ మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్, 16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు తెలిపారు.

🟢ఉచితంగా వివాదాల పరిష్కారం

మీడియేషన్ ద్వారా వ్యక్తుల మధ్య, గ్రూపులు లేదా సంస్థల మధ్య ఉన్న వివాదాలను ఎటువంటి ఖర్చు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరిష్కరించుకోవచ్చని జడ్జి పేర్కొన్నారు. నందిగామ కోర్టుల పరిధిలోని సివిల్ దావాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, బ్యాంకు దావాలు, చెక్ బౌన్స్ కేసులు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.

🟢సమయం, ఖర్చు ఆదా

మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు సమయం ఆదా కావడంతో పాటు కోర్టుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు. మధ్యవర్తులు ఇరువర్గాల వాదనలు విని, వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, పరస్పర అంగీకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు.

🟢స్నేహపూర్వక వాతావరణానికి దోహదం

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని, సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జడ్జి పి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.