ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం, తెలంగాణ రాష్ట్ర పండుగ, బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కె.చంద్రశేఖర్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు.
పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ, దేశంలోని అన్ని సాంప్రదాయ పండుగల్లో ప్రత్యేకమైనదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి దర్పణంగా నిలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ప్రజల జీవితంలో భాగమైందని తెలిపారు.
ఎంగిలిపూల బతుకమ్మగా ప్రారంభమై, సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు.
పిల్లాపాపలతో ఒకచోట కూడి, ఆటాపాటలతో, ఆడపడుచులు బతుకమ్మను కొలిచి మొక్కుతారని అన్నారు.
తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదానివ్వడమే కాకుండా, ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసే సాంప్రదాయాన్ని అమలు చేసిందని అన్నారు.
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి సంక్షేమానికి పలు రకాల పటిష్ట కార్యక్రమాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు










