కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర పీడీఎస్యూ నాయకురాలు, కామ్రేడ్ జాడి మంజుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కొత్తగూడెంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ జాడి మంజుల, ఆమె భర్త కొండ జంపన్న దంపతులు విద్యార్థి దశ నుంచే పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ప్రజా పోరాటాలు నిర్వహించారని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని నిరంతరం పోరాడిన నాయకురాలిగా మంజుల సేవలను గుర్తుచేసుకున్నారు.
ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పేద ప్రజల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ప్రజల హక్కుల సాధన కోసం ఆమె సాగించిన పోరాటాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. మంజుల మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కామ్రేడ్ జాడి మంజుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గౌస్ మొయిద్దీన్, మాజీ ఎంపీటీసీ హరీష్ ఖాన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏలేటి వెంకటేశ్వర్లు, దుర్గరాసి సమ్మయ్య, ఎన్ఎస్యూఐ నాయకుడు నహీం, సీపీఐ నాయకుడు ఫయీమ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నవతన్ తదితరులు పాల్గొని కామ్రేడ్ జాడి మంజుల భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.









