బెంగళూరు పబ్‌లో రగడ.. ఏపీ ఐఏఎస్ అధికారిపై క్రిమినల్ కేసు!

0
1

ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. నగరంలోని ఓ పబ్‌లో పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన స్నేహితులపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లగా, దీనిపై ఆయన తీవ్రంగా స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరపాలని సీఎస్ ను ఆదేశించినట్టు తెలుస్తోంది.

 

వివరాల్లోకి వెళితే, అక్టోబర్ 9వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని ‘కావోర్ బార్ అండ్ రెస్టారెంట్’లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటినా పబ్ నడుపుతుండటంతో పాటు, వయసు నిర్ధారణ కోసం అక్కడ ఉన్న వారి ఐడీ కార్డులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడే స్నేహితులతో ఉన్న వికాస్ మర్మత్, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.