● 17 సంచలనాత్మక కేసుల ఛేదనపై డీజీపీ ప్రశంసలు
● చిన్నారి కిడ్నాప్, హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
● నేరాల దర్యాప్తు, సాంకేతిక పరిజ్ఞానం, పెట్రోలింగ్పై సమీక్ష
అల్వాల్,అక్టోబర్15:మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నమోదైన 17 సంచలనాత్మక, కీలక కేసులన్నింటినీ ఛేదించిన పోలీసుల పనితీరును తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, ఐపీఎస్ ప్రశంసించారు.
ముఖ్యంగా చిన్నారి కిడ్నాప్, హత్య కేసును కేవలం 24 గంటల్లోనే ఛేదించడాన్ని అభినందించారు. నేరాల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, పెట్రోలింగ్, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ను సందర్శించిన డీజీపీ, పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్తోపాటు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలతో సమావేశమయ్యారు.
కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ ప్రాధాన్యాలు, కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, పెట్రోలింగ్ వ్యవస్థ, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, దర్యాప్తులో నాణ్యమైన ఆధారాలను సేకరించాలని, పోలీసు అధికారుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
నేరాల నియంత్రణలో సీసీటీఎన్ఎస్ (CCTNS) వినియోగం, బీట్ పోలీసింగ్, రాత్రి పెట్రోలింగ్ కీలక పాత్ర పోషిస్తాయి.
నేరాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో నిఘాను పెంచడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, ప్రజలతో సమన్వయం కొనసాగించడం ద్వారా నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సాంకేతిక ఆధారాల సేకరణ, వేగవంతమైన దర్యాప్తు, సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయడం కూడా కీలకం.
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దొంగతనాలు, మోసాలు, గాయాలకు సంబంధించిన కేసుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి అవసరం.
నేరాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి, క్షేత్రస్థాయిలో పోలీసుల నిఘాను పెంచడం, నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా నేరాలను అదుపులోకి తీసుకురావచ్చు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు బాధితులు వెంటనే ఫిర్యాదు చేసేలా చర్యలు చేపట్టడం కూడా అవసరం.
రహదారి ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా పెంచడం, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై తనిఖీలు నిర్వహించడం, ట్రాఫిక్ నిబంధనల అమలును పర్యవేక్షించడం ముఖ్యం.
నివాస సముదాయాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల వినియోగం, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై అప్రమత్తత ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు.
పోలీసు సిబ్బందికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ, దర్యాప్తు నైపుణ్యాల పెంపు, విధుల నిర్వహణలో సమన్వయం వంటి అంశాలు పోలీసింగ్ ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకం. నేరాల నియంత్రణతోపాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తూ, వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వహించాలని డీజీపీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కీలక కేసుల ఛేదనలో చూపిన పనితీరును కొనసాగిస్తూ, ప్రజా భద్రతకు మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
#Sidhumaroju
Alwal










