పలాస, అక్టోబర్ 16: స్థానిక ఎన్నికల నేపథ్యంలో పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత ఊతమిస్తూ వజ్రపుకొత్తూరు మండలం పెద్దబడం పంచాయతీకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు టీడీపీలో చేరారు.
పెద్దబడం పంచాయతీకి చెందిన పీత శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో మాజీ, ప్రస్తుత సర్పంచులు సహా పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొర్ర గిరిబాబు, పీత పురుషోత్తం, బాడ గణపతి తదితరులు అధికారికంగా టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన నాయకులు పార్టీలో చేరడం శుభపరిణామమని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండటం ప్రతి నాయకుడి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సూరాడ మోహన్రావు, కార్యదర్శి కర్ని రమణ, పీఏసీఎస్ చైర్మన్ కనితి సురేష్, క్లస్టర్ కన్వీనర్ ఉమామహేశ్వరరావు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










