ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

0
3

మంచిర్యాల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎల్‌నినో ప్రభావం కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పరిస్థితులను కరోనా మహమ్మారి సమయంలో మాదిరిగా ప్రజలందరి సహకారంతో సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.మంచిర్యాల నియోజకవర్గంలో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను ఎంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో యాసంగి సాగుకు సంబంధించి నీటి లభ్యతను అంచనా వేసుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు.తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. నీటి సంక్షోభం తలెత్తకుండా ప్రజలు నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. దివంగత కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏటా ఆడపడుచులకు అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈసారి కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా అందించే చీరలను ఈసారి సంక్రాంతి పండుగకు పది రోజుల ముందుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు, ఆడపడుచులకు ముందస్తు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ పాల్గొన్నారు.అలాగే కార్పొరేటర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.