అల్వాల్, అక్టోబర్ 31: గుజరాత్‌లోని నర్మదా జిల్లా కెవాడియాలో నిర్వహిస్తున్న రెండు రోజుల రాష్ట్రీయ ఏక్తా దివస్ ఉత్సవాల్లో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు.
శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరై ఆనందమఠ్ సభ్యులు ప్రదర్శించిన ప్రత్యేక నృత్యరూపకాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విశేషాలను ఆయన వెల్లడించారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 182 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్మదా నదిపై నిర్మించిన సర్దార్ సరోవర్ డ్యామ్ సమీపంలో ఉన్న ఈ విగ్రహం జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
దేశంలోని 10 మావోయిస్టు ప్రభావిత జిల్లాల డీజీపీలు, అన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాల డీజీలు సహా పలువురు ప్రముఖులను ఈ ఉత్సవాలకు ఆహ్వానించినట్లు వివరించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని మండలాలు, జిల్లాలకు చెందిన అన్ని వర్గాల నుంచి 50 మందిని కూడా ఆహ్వానించారని, హైదరాబాద్ నుంచి సుమారు 400 మంది ప్రత్యేక రైలులో కెవాడియాకు చేరుకున్నారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆనందమఠ్ సభ్యులు ప్రదర్శించిన నృత్యరూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో ‘వందేమాతరం’ నినాదం పోషించిన స్ఫూర్తిదాయక పాత్రను ఈ ప్రదర్శన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారని తెలిపారు.
ఇదిలా ఉండగా, గత ఐదు దశాబ్దాలుగా మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన వివిధ ప్రత్యేక పోలీసు బలగాల సేవలను చాటిచెప్పేలా శనివారం సాయంత్రం ఏక్తా పరేడ్ నిర్వహించనున్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలన కోసం పోరాడిన ప్రత్యేక బలగాలు ఈ పరేడ్‌లో పాల్గొననున్నాయి. తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ ప్రత్యేక బృందం కూడా ఇందులో భాగం కానుందని సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఇందుకోసం గ్రేహౌండ్స్ బృందం నెల రోజులకు పైగా కెవాడియాలో ప్రత్యేక సాధన చేస్తోందని తెలిపారు. ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న ఏక్తా పరేడ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించనుండగా, సాయంత్రం 5.30 గంటల నుంచి దేశవ్యాప్తంగా టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
#Sidhumaroju
Alwal










