పోలింగ్ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు: కాశీబుగ్గ డీఎస్పీ

0
1

ఎన్నికల సిబ్బందికి దిశానిర్దేశం

పలాస–కాశీబుగ్గ, అక్టోబర్ 31: ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల విధులకు నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బందికి కాశీబుగ్గ డీఎస్పీ జి.వి. రమణ శనివారం ప్రత్యేక అవగాహన కల్పించి, విధులపై దిశానిర్దేశం చేశారు. ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గలో వేర్వేరుగా ఈ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి పోలీసు సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ఎలాంటి అలసత్వానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిని సున్నంతో స్పష్టంగా గుర్తించాలని, ఆ పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. 200 మీటర్ల పరిధికి వెలుపల మాత్రమే, తెల్ల కాగితంపై ముద్రించిన ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాతే ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సూచించారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ ప్రచార సామగ్రి కనిపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ, నలుగురికి మించి వ్యక్తులు గుమిగూడకుండా చూడాలని డీఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, గేట్లు తదితర భద్రతా ఏర్పాట్లను ముందుగానే తనిఖీ చేయాలని, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు, ఇతర పోలీసు సిబ్బందితో సమన్వయం పాటించాలని పేర్కొన్నారు. ఆర్వో ఆదేశించినప్పుడు మాత్రమే పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, క్యూ లైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా వారి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రూట్ మొబైల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. కేటాయించిన సమయానికి విధుల్లో చేరి, బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని, పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసు భద్రత నడుమ నిర్దేశిత భద్రతా కేంద్రాలకు చేర్చాలని ఆదేశించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు, కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో, పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, కాశీబుగ్గ, ఇచ్చాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.