• గుండి బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వమే.
• కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సమాధానం చెప్పాలి.
• కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్.
🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క తీవ్రంగా ఖండించారు. కుమురం భీం ఆసిఫాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ.. గుండి బ్రిడ్జి నిర్మాణానికి అసలు బీజం పడిందే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అయితే నిర్మాణ దశలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేసి వెళ్ళిపోయారని గుర్తుచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు సుదీర్ఘంగా పాలించినప్పటికీ, గుండి బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయిందో ఎమ్మెల్యే కోవ లక్ష్మి సమాధానం చెప్పాలని సుగుణక్క డిమాండ్ చేశారు. గత పదేళ్ల పాలనలో తాము చేయలేని పనులపై ప్రజలకు సమాధానం చెప్పకుండా, ఇప్పుడు అధికారంలోకి వచ్చి కనీసం మూడేళ్లు కూడా పూర్తికాని కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రులపై అప్పుడే విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
గతంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి సీతక్క గారు గుండి బ్రిడ్జి ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, స్థానిక ప్రజలకు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు సైతం నిధుల మంజూరుకు హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే గుండి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు.
• ప్రాజెక్టుల నాణ్యతపై విమర్శలు: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జిలు, ప్రాజెక్టులు ఎంతో నాణ్యతతో ఉండి, నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని సుగుణక్క కొనియాడారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నేడు వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచిందని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్వహణ లోపాలు మరియు ప్రజాధనం వృధా కావడానికి గత ప్రభుత్వ తీరే కారణమని ఆమె విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పూర్తి ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తోందని, ప్రజల సంక్షేమం, అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
• సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు: డీసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్, మండలాల అధ్యక్షులు రాపర్తి మురళి, ఇమ్రాన్, సుజాహిద్ ఖాన్, రమేష్ జాదవ్, కిషన్ గౌడ్, చునార్కర్ మహేష్‌లతో పాటు పలువురు డీసీసీ కార్యవర్గ సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










