30వ వార్డులో తూముల సుజాతకు మద్దతుగా అప్పలరాజు ప్రచారం

0
3

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ వార్డులో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తూముల సుజాతకు, చైర్‌పర్సన్ అభ్యర్థి తాలసు శ్రీపద్మకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.

సుజాత భర్త శ్రీనివాసరావు పట్టుదలతో పనిచేసే వ్యక్తి అని, 2018 నుంచి తనతో కలిసి పనిచేస్తున్నారని అప్పలరాజు అన్నారు. ఇటీవల రాత్రివేళ కొందరు ఇంటి వద్దకు వచ్చి బెదిరించినా సుజాత ధైర్యంగా నిలబడ్డారని, మహిళలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన మహిళలకు రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3,000, పింఛన్లు, ఇంటి స్థలాలు, డ్వాక్రా రుణమాఫీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నిత్యావసర ధరల పెరుగుదలపై, మద్యం బాటిళ్లపై అదనంగా రూ.10–20 వసూలు చేస్తున్నారన్న అంశంపై ఆరోపణలు చేశారు.

ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయని, కౌన్సిలర్‌గా సుజాతకు, చైర్‌పర్సన్‌గా శ్రీపద్మకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.