ఇళ్లల్లో పనిచేసే వారి వివరాలపై పోలీసుల ప్రత్యేకనిఘా.|

0
30

● ‘మీ సురక్ష 2.0 – హాక్ ఐ’తో నివాస ప్రాంతాల భద్రతకు సీపీ సుమతి ముందడుగు

● 465 ప్రాంతాల్లో 3,177 మంది సేవా సిబ్బంది వివరాల నమోదు

అల్వాల్, నవంబర్ 2: నగరంలోని నివాస ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు నేరాల నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇళ్లలో పనిచేసే గృహ సహాయకులు, డ్రైవర్లు, వాచ్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులు తదితర సేవా సిబ్బంది వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి ధ్రువీకరించే లక్ష్యంతో ‘మీ సురక్ష 2.0 – హాక్ ఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా నివాస ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలని పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

నగరాల్లో అపార్ట్‌మెంట్లు, కాలనీలు, స్వతంత్ర ఇళ్లలో వివిధ రకాల సేవలు అందించే వ్యక్తుల రాకపోకలు నిరంతరం కొనసాగుతుంటాయి.

ఇంటి పనులు, వాహనాల నిర్వహణ, భద్రత తదితర అవసరాల కోసం పలువురు సిబ్బంది ఇళ్లకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చేవారి ప్రాథమిక వివరాలు, గుర్తింపు సమాచారం అందుబాటులో ఉండటం గృహ భద్రతకు కీలకంగా మారుతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన సీపీ బి. సుమతి, సేవా సిబ్బంది వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి ధ్రువీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కాలనీలు, అపార్ట్‌మెంట్లలో దొంగతనాలు లేదా ఇతర నేరాలు జరిగినప్పుడు అక్కడికి రాకపోకలు సాగించిన వ్యక్తుల వివరాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ముందుగానే సేవా సిబ్బంది వివరాలు నమోదు చేయడం ద్వారా అవసరమైన సందర్భాల్లో పోలీసులకు సమాచార సేకరణ సులభతరం కానుంది. 

అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నివాసులు అప్రమత్తంగా ఉండటంతో పాటు పోలీసులకు సమాచారం అందించేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుంది.

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మూడు జోన్లలో ఇప్పటికే 465 ప్రాంతాల్లో 3,177 మంది సేవా సిబ్బంది వివరాలను నమోదు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. మల్కాజిగిరి జోన్‌లో 273 ప్రాంతాలకు సంబంధించి 1,533 మంది, ఉప్పల్ జోన్‌లో 89 ప్రాంతాల్లో 848 మంది, ఎల్బీనగర్ జోన్‌లో 103 ప్రాంతాల్లో 796 మంది వివరాలను నమోదు చేశారు. కార్యక్రమ ప్రారంభానికి సుమారు 700 మంది పౌరులు హాజరయ్యారు.

నివాస సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, హాస్టళ్లు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీపీ బి. సుమతి కోరారు.

సేవా సిబ్బంది వివరాలను నమోదు చేయించడంతో పాటు, వారి గుర్తింపు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, సిబ్బంది మారినప్పుడు వివరాలను నవీకరించాలని సూచించారు.

 పోలీసుల చర్యలకు ప్రజల సహకారం తోడైతే నివాస ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేయవచ్చనే లక్ష్యంతో మల్కాజిగిరి కమిషనరేట్ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

#Sidhumaroju

Alwal