● అర్ఫాజ్ హత్యకు పథకం.. పోలీసుల ముందస్తు చర్య
● రెండు నాటు తుపాకులు, 8 తూటాలు స్వాధీనం
● ఉప్పల్ పోలీసులు, ఎస్ఓటీ సంయుక్త ఆపరేషన్
అల్వాల్, నవంబర్ 3: పాత కక్షల నేపథ్యంలో అర్ఫాజ్ను హత్య చేసేందుకు పన్నిన కుట్రను మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు, ఎస్ఓటీ ఎల్బీనగర్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల సకాల స్పందనతో జరగబోయే హత్యను అడ్డుకుని ప్రాణనష్టాన్ని నివారించినట్లు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. దాసరి సురేందర్ అలియాస్ సూరి తన భార్య షబా, ఆమె సోదరుడు సల్మాన్‌ను గతంలో హత్య చేశాడు. షబా మరో సోదరుడు అర్ఫాజ్ 2026 జూలైలో సురేందర్‌ను హత్య చేశాడు. ఈ కేసులో జైలు నుంచి విడుదలైన అర్ఫాజ్ను అంతమొందించేందుకు సురేందర్ అనుచరులు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ పథకంలో భాగంగా ఇద్దరు నిందితులు ఆదిత్య కుమార్ ఠాకూర్‌కు ఫోన్‌పే ద్వారా రూ.35 వేలు పంపించారు. ఆదిత్య బీహార్‌లోని భాగల్పూర్ జిల్లా సైద్పూర్ దబ్రా ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తి నుంచి రూ.30 వేలకు రెండు నాటు తుపాకులు, బుల్లెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
అరెస్టయిన వారిలో తనయ్ కుమార్ అలియాస్ కన్నా (26), షేక్ అక్బర్ (26), ఆదిత్య కుమార్ ఠాకూర్ (33), దుదాని లక్ష్మణ్ సింగ్ అలియాస్ సోను (27), వడ్త్యా వెంకటేశ్ అలియాస్ నాని (22) ఉన్నారు. వీరిలో సోనుపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉండటంతో పాటు రెండు హత్య కేసులు సహా మొత్తం 30 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, ఎనిమిది తూటాలు, మూడు కత్తులు, రెండు స్కూటర్లు, ఒక ఆటోరిక్షా, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రతే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని కమిషనర్ సుమతి పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










