కొత్తగూడెం సీఎంఆర్ బియ్యం పక్కదారి.. బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి డిమాండ్!

0
3

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టిన వ్యవహారంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యం అక్రమంగా పక్కదారి పడుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని 39 రైస్ మిల్లుల్లో సీఎంఆర్ బియ్యం పక్కదారి పట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

 

లక్ష్మీదేవిపల్లిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 39 రైస్ మిల్లులలో వందల కోట్ల విలువచేసే 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టిందని, రైతుల నుండి సేకరించిన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పడుతున్నట్లు తెలిసినా సివిల్ సప్లై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తీవ్రంగా విమర్శించారు.

 

కొత్తగూడెంలోని శ్రీజ రైస్ మిల్లులో సుమారు రూ.6 కోట్ల 90 లక్షల విలువైన 1,750 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకుడు ఆళ్ళ మురళి పాత్రపై విచారణ జరిపి, ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జరుగుతున్న జాప్యంపై పోలీసులు వివరణ ఇవ్వాలని కోరారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు ఈ అంశంపై తక్షణమే స్పందించాలన్నారు.

 

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం మొత్తాన్ని 25 శాతం జరిమానాతో సహా పూర్తిగా వసూలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు సముద్రాల గాయత్రి ,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ బాబు, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్ ,బూర్గంపాడు మండల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎస్టి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మంగీలాల్ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి హరీష్ తదితరులు పాల్గొన్నారు.