దివ్యాంగుల సాధికారతకు విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తుల సమర్పణ

0
1

మంచిర్యాల, నవంబర్ 7: దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారత కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందించనున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు.

ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి పురస్కారాలతో సత్కరించనున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం సేవలందిస్తున్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పురస్కారాలకు సంబంధించిన దరఖాస్తు నమూనా, అర్హతలు, పూర్తి మార్గదర్శకాల కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://depwdsctgp.telangana.gov.in ను సంప్రదించవచ్చని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత నమూనాలో అవసరమైన ధృవీకరణ పత్రాలను జతచేసి ఈ నెల 16వ తేదీలోగా మంచిర్యాల జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ కోరారు.