లక్షెట్టిపేట: నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆనందంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు భాగస్వాములయ్యారు.
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సంబరాల్లో భాగంగా సోమవారం లక్షెట్టిపేట మండలంలోని చందారం, పాత కొమ్ముగూడెం గ్రామాల్లో నూతన గృహప్రవేశాలు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతులు స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసుకున్న లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే దంపతులు తమ ఇళ్లకు స్వయంగా వచ్చి శుభాకాంక్షలు తెలపడంతో లబ్ధిదారుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఒక నిరుపేద కుటుంబం సొంతింటిలోకి అడుగుపెట్టి ఆనందంగా జీవించడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఇళ్ల నిర్మాణంతో పాటు పేద కుటుంబాల ఆనందంలోనూ భాగస్వామ్యం కావడం ప్రత్యేకతగా నిలిచింది. లబ్ధిదారుల కుటుంబాలతో ఆప్యాయంగా మమేకమై, వారి సంతోషాన్ని పంచుకున్న ప్రేమ్ సాగర్ రావు–సురేఖ దంపతుల పర్యటన గ్రామాల్లో సందడి నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










