● రూ.1,196 కోట్లతో 28 ఎకరాల్లో 1,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
● మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
● 2027 జనవరి నుంచి వైద్య సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు
అల్వాల్,నవంబర్10:సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్–బొల్లారంలో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రూ.1,196 కోట్ల అంచనా వ్యయంతో 28 ఎకరాల విస్తీర్ణంలో 1,200 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో 2027 జనవరి నుంచి వైద్య సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం ఆస్పత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఆస్పత్రికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఓపీ, అత్యవసర వైద్య విభాగాలు, ఐసీయూ, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బ్లూప్రింట్లను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
● అత్యాధునిక వైద్య సదుపాయాలు
28 ఎకరాల్లో జీ+8 అంతస్తులతో, 12,14,060 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో 1,200 పడకలు, 24 ఆపరేషన్ థియేటర్లు, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎమర్జెన్సీ, ట్రామా కేర్ వంటి కీలక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రి నిర్వహణ కోసం ప్రభుత్వం 3,039 పోస్టులను మంజూరు చేసింది.
● పరిసర జిల్లాల ప్రజలకు ప్రయోజనం
ఆల్వాల్ టిమ్స్ అందుబాటులోకి వస్తే ఉత్తర హైదరాబాద్‌తో పాటు కంటోన్మెంట్, అల్వాల్, బొల్లారం, సికింద్రాబాద్ ప్రాంతాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు చేరువకానున్నాయి. సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చే రోగులకు కూడా ఈ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి రానున్నాయి. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులపై రోగుల రద్దీ తగ్గడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందనుంది.
● జనవరి నుంచి వైద్య సేవలు ప్రారంభించే లక్ష్యం
నవంబర్ 4న నిర్వహించిన సమీక్షలో అధికారుల నివేదిక ప్రకారం ఆస్పత్రి నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం వైద్య పరికరాల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతోంది. ఇప్పటికే సనత్‌నగర్‌లో 1,082 పడకల సామర్థ్యంతో నిర్మించిన టిమ్స్ ఆస్పత్రిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టులో ప్రారంభించారు. అక్కడ రోజుకు సుమారు 600 మంది ఔట్ పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు.
2027 డిసెంబర్ 9 నాటికి ఉస్మానియా ఆస్పత్రి, ఎల్బీ నగర్ టిమ్స్, ఆల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో కలిపి మొత్తం 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఆల్వాల్ టిమ్స్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి, ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆల్వాల్ టిమ్స్ కీలకంగా నిలవనుంది.
#Sidhumaroju
Alwal










