ఎంవీఐ జేబులో ఫుల్… ప్రభుత్వ ఖజానాకు తనిఖీల పేరుతో బెదిరింపులు.. ఆ తర్వాత బేరసారాలా?ఆఫీసుకు వెళ్లే దారిలోనే వసూళ్ల దందా! నిల్!

0
1

పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు వస్తున్నా కొందరి అక్రమ సంపాదనకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందా? విధి నిర్వహణ పేరుతో తనిఖీలు చేస్తూ, ప్రైవేట్ డ్రైవర్ల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

మల్లంపేట, బొల్లారం, సుల్తాన్‌పూర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్డు మీదుగా ఖాజిపల్లి ప్రాంతంలోని క్రషర్ల నుంచి ప్రతిరోజూ వందలాది టిప్పర్లు రోబో సాండ్, 20 ఎంఎం మెటీరియల్ తదితర లోడ్లతో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటితో పాటు అనేక భారీ వాణిజ్య వాహనాలు కూడా ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి.

పటాన్‌చెరు ఆర్టీఓ కార్యాలయం రింగ్‌రోడ్ సమీపంలో ఉండటంతో ఉదయం కార్యాలయానికి వెళ్లే సమయంలో, తిరిగి విధులు ముగించుకుని వచ్చే సమయంలో కొందరు ఎంవీఐ అధికారులు మార్గమధ్యంలో వాహనాలను ఆపి ఓవర్‌లోడ్, ఇతర పత్రాల పేరుతో తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తనిఖీల పేరుతో బెదిరింపులు.. ఆ తర్వాత బేరసారాలా?

వాహనాలను ఆపి మొదట కేసులు నమోదు చేస్తామని డ్రైవర్లను భయపెట్టి, అనంతరం మధ్యవర్తుల ద్వారా బేరసారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారి తన ప్రైవేట్ డ్రైవర్‌ను ఉపయోగించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఒక్కో టిప్పర్ నుంచి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు, ఇతర వాహనాల నుంచి అదనంగా రూ.1,000 నుంచి రూ.2,000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. డబ్బులు చెల్లించిన వాహనాలపై ఎలాంటి జరిమానాలు విధించకుండా పంపిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లా?

ఈ మార్గంలో జరుగుతున్నాయని చెబుతున్న అక్రమ వసూళ్ల విలువ రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తాలకు సంబంధించి అధికారిక ఆధారాలు, స్వతంత్ర నిర్ధారణ అవసరం.

ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పలువురు అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారాలపై కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉన్నతాధికారులు స్పందించాలి.. విచారణ జరిపించాలి!

ప్రభుత్వానికి రావాల్సిన జరిమానాలు, ఆదాయం వ్యక్తుల జేబుల్లోకి వెళ్తే ప్రజాధనానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ ఆరోపణలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

వాహనాల తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ ఆవాజ్ నేషనల్ మీడియా డిమాండ్ చేస్తోంది.