అనంతారం గ్రామంలో జలవనరుల అభివృద్ధిపై విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ బృందం పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో శుక్రవారం విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ (ప్రైవేటు సంస్థ) బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామంలో తాగునీరు, భూగర్భ జలాలకు సంబంధించిన సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
భూగర్భ జలమట్టాలను పెంచడంతో పాటు భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్స్ తదితర జలవనరుల అభివృద్ధి పనులను యంత్రాల సహాయంతో చేపట్టేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని బృంద సభ్యులు తెలిపారు. గ్రామంలో నీటి వనరులను అభివృద్ధి చేసి భూగర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్సా రమేష్, పంచాయతీ కార్యదర్శి శైలజ, ఎఫ్.ఏ. నాగమణి తదితరులు పాల్గొన్నారు.










