● ఫేస్బుక్ ప్రకటనతో వ్యాపారికి వల
● ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్ పేరుతో విడతల వారీగా వసూళ్లు
● బీహార్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీ
అల్వాల్, నవంబర్ 17:ఫేక్ ముద్రా లోన్ ఇప్పిస్తామంటూ వ్యాపారిని నమ్మించి రూ.4,67,800 కాజేసిన సైబర్ మోసగాళ్ల ముఠా గుట్టును మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఫేస్బుక్లో ముద్రా లోన్ ఇప్పిస్తామంటూ వచ్చిన ప్రకటనను చూసిన బాధిత వ్యాపారి అందులో పేర్కొన్న వివరాల ద్వారా నిందితులను సంప్రదించాడు. రుణం మంజూరు చేస్తామని నమ్మించిన వారు అతని నుంచి ఆధార్, పాన్ కార్డులతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. అనంతరం ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్ తదితర ఛార్జీల పేరుతో విడతల వారీగా మొత్తం రూ.4,67,800 వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు.
●నలుగురి అరెస్ట్.. రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు. మోసానికి గురైన నగదు ఎక్కడికి బదిలీ అయిందనే అంశంపై మనీ ట్రయిల్‌ను పరిశీలిస్తున్నారు.
●సీపీ పర్యవేక్షణలో పోలీసు బృందం
సీపీ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో, సీనియర్ అధికారుల మార్గదర్శకత్వంతో ఇన్స్పెక్టర్ జె.ఎల్. కృష్ణంరాజు నేతృత్వంలోని బృందం ఈ కేసును ఛేదించి అరెస్టులు చేపట్టింది.
●ప్రజలకు పోలీసుల హెచ్చరిక
సోషల్ మీడియాలో కనిపించే రుణ ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు సూచించారు. రుణం మంజూరు చేస్తామంటూ ముందస్తుగా డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఇతరులకు వెల్లడించవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు.
#Sidhumaroju
Alwal









