● అక్టోబర్‌లో 74 శాతం లోటు వర్షపాతం.. పడిపోయిన భూగర్భ జలమట్టాలు
● మల్కాజ్‌గిరిలో 17.89 మీటర్లు.. ఉప్పల్‌లో 15.52 మీటర్ల లోతుకు నీరు
● బాచుపల్లి, మూడు చింతలపల్లిలోనూ భారీ క్షీణత.. ముందస్తు చర్యలపై ప్రశ్నలు
అల్వాల్, నవంబర్ 18: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. వర్షపాతం గణనీయంగా తగ్గడం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నీటి వినియోగం, భూగర్భ జలాలపై అధిక ఆధారపడటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తున్నాయి. అక్టోబర్ నెలలో జిల్లాలో సాధారణం కంటే 74 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాల పునరుద్ధరణకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా రానున్న వేసవిలో బోర్లు ఎండిపోయి తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భూగర్భ జలాల శాఖ తాజా నివేదిక ప్రకారం 2026 అక్టోబర్‌లో జిల్లాలో కేవలం 27.9 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఇది 74 శాతం లోటు. ఈ పరిస్థితిని శాఖ ‘లార్జ్ డెఫిసిట్’గా వర్గీకరించింది. గత ఏడాది నవంబర్‌లో భూమట్టానికి 6.51 మీటర్ల లోతులో ఉన్న జిల్లా సగటు భూగర్భ జలమట్టం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 12.67 మీటర్లకు పడిపోయింది. అంటే నీటి మట్టం మరో 6.16 మీటర్ల లోతుకు చేరింది.
● మల్కాజ్గిరి, ఉప్పల్‌లోనూ తగ్గుదల
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మల్కాజ్‌గిరిలో భూమట్టానికి 17.89 మీటర్ల లోతులో నీటి మట్టం నమోదవగా, ఉప్పల్‌లో 15.52 మీటర్లకు చేరింది. దుండిగల్ ప్రాంతంలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పీజోమీటర్లో 37.63 మీటర్ల లోతులో నీరు నమోదైంది. అదే సమయంలో నాచారం ఈఎస్ఐ వద్ద 2.30 మీటర్ల లోతులో నీటి మట్టం నమోదైంది. ప్రాంతాలవారీగా భూగర్భ జలాల లభ్యతలో ఎంత వ్యత్యాసం ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
● బాచుపల్లి, మూడు చింతలపల్లిలోనూ క్షీణత
బాచుపల్లిలో భూగర్భ జలమట్టం 36.54 శాతం మేర క్షీణించగా, ముడుచింతలపల్లిలో 31.66 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య నిర్మాణాలు వేగంగా విస్తరిస్తుండటం, నీటి వినియోగం పెరుగుతుండటం కూడా స్థానికంగా భూగర్భ జలాలపై ఒత్తిడికి కారణమవుతున్నట్లు నివేదిక విశ్లేషించింది. ఇప్పటికే లోతైన ప్రాంతాల్లో నీటి మట్టం మరింత పడిపోవడంతో గృహ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న బోర్లు విఫలమయ్యే ప్రమాదం పెరుగుతోంది.
● అల్వాల్‌లోనూ ప్రత్యేక పర్యవేక్షణ
జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని తెలుసుకునేందుకు 15 మండలాల పరిధిలో 26 పీజోమీటర్లు, రెండు పరిశీలనా బావుల ద్వారా ప్రతి నెలా నీటి మట్టాలను అధికారులు నమోదు చేస్తున్నారు. అల్వాల్‌లోని ఓల్డ్ అల్వాల్ వెటర్నరీ ఆసుపత్రి వద్ద, యాప్రాల్ సబ్‌స్టేషన్ వద్ద పర్యవేక్షణ కేంద్రాలు ఉన్నాయి. వెటర్నరీ ఆసుపత్రి వద్ద ప్రతి ఆరు గంటలకు ఒకసారి నీటి మట్టాన్ని నమోదు చేసే డిజిటల్ పరికరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజా నివేదికలో అల్వాల్‌కు సంబంధించిన ప్రత్యేక నీటి మట్టం గణాంకాలు వెల్లడికాలేదు.
● వేసవికి ముందే మేల్కొనాల్సిన అవసరం
జిల్లాలో భూగర్భ జలాల వినియోగం, లభ్యత మధ్య సమతుల్యత దెబ్బతింటున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవనాలపై పడే వర్షపు నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలి. బోర్ల ద్వారా నీటిని విచ్చలవిడిగా తోడేయకుండా వినియోగాన్ని నియంత్రించాలి. వేసవి ప్రారంభమయ్యేలోపే సంబంధిత శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ రూపొందించకపోతే కాలనీల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే భూగర్భ జలాల సంరక్షణపై ప్రజలు, అధికారులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
#Sidhumaroju
Alwal









