● మొకిలా హెచ్ఎండీఏ లేఅవుట్లో 22ఏ చిక్కులు
● చెల్లింపులు పూర్తిచేసినా కొనుగోలుదారులకు తప్పని ఎదురుచూపులు
● కలెక్టర్ ఎన్ఓసీ కోసం నిలిచిన రిజిస్ట్రేషన్లు
అల్వాల్,నవంబర్18:హైదరాబాద్ నుంచి శంకర్పల్లి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న మొకిలా వద్ద హెచ్ఎండీఏ వేలం వేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జాప్యమవుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి వేలంలో ప్లాట్లు దక్కించుకుని, పూర్తి మొత్తాన్ని చెల్లించినప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
మొకిలా వద్ద 165.37 ఎకరాల విస్తీర్ణంలో 1,293 ప్లాట్లతో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు విడతల వారీగా 700కు పైగా ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయించింది. మూడు నెలల క్రితం నిర్వహించిన వేలంలో 100కు పైగా ప్లాట్లకు చదరపు గజానికి గరిష్ఠంగా రూ.1,09,500 ధర పలికింది. ఈ వేలంలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో పలువురు చెల్లింపులు పూర్తి చేసినా రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
● 22ఏ జాబితాలో భూములు
లేఅవుట్లోని భూముల్లో కొంత భాగం ప్రభుత్వ, అసైన్డ్ భూములకు సంబంధించినదిగా ఉండటమే సమస్యకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా సర్వే నంబర్ 96/పీ పరిధిలోని కొంత భూమి ఇంకా 22ఏ నిషేధిత జాబితాలో కొనసాగుతోంది. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) అందకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు హెచ్ఎండీఏ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ఒకటి, రెండు దశల్లో విక్రయించిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు సజావుగా జరిగినప్పటికీ, ఇటీవల వేలంలో అమ్మిన ప్లాట్ల విషయంలోనే ఈ సమస్య ఎదురవుతోంది.
● కొనుగోలుదారుల్లో ఆందోళన
కోట్లాది రూపాయలు చెల్లించి ప్రభుత్వ సంస్థ నిర్వహించిన వేలంలో ప్లాట్లు కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ జరగకపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ వేలం అంటేనే వివాదరహితమైన భూములపై నమ్మకంతో భారీ ధరలు చెల్లించామని, ఇప్పుడు 22ఏ జాబితా పేరుతో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు హెచ్ఎండీఏపై, ప్రభుత్వంపై కొనుగోలుదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన చెందుతున్నారు.
● ఎన్ఓసీ వస్తేనే పరిష్కారం
ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, హెచ్ఎండీఏ అనుమతులు పొందిన లేఅవుట్లలో 22ఏ జాబితాలో ఉన్న భూములకూ రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం సెప్టెంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసినట్లు కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. అయితే, మొకిలా లేఅవుట్‌కు సంబంధించి కలెక్టర్ నుంచి ఎన్ఓసీ అందిన తర్వాతే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం కొనుగోలుదారులకు ప్రశ్నార్థకంగా మారింది.
#Sidhumaroju
Alwal










