పాత కరెంట్ బిల్లు.. కొత్త అద్దెదారుడికి బాదుడు |

0
9

● గతంలో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు కొత్తవారిపై భారం

● ఒకే మీటర్.. మారిన అద్దెదారులు.. పాత వినియోగమే లెక్క

● అల్వాల్, మల్కాజ్‌గిరిలో ఓనర్లు, అద్దెదారుల మధ్య వివాదాలు

అల్వాల్, నవంబర్ 18: గతంలో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇప్పుడు అద్దె ఇళ్లలో, వాణిజ్య సముదాయాల్లో వివాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అల్వాల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఒకే విద్యుత్ కనెక్షన్‌పై అద్దెదారులు మారిన సందర్భాల్లో పాత వినియోగం ఆధారంగా ప్రస్తుత వినియోగదారులకు అదనపు భారం పడుతుండటంతో ఇంటి యజమానులు, అద్దెదారుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.

2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు, ఆదాయ సర్దుబాట్ల నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) మొత్తం రూ.7,635.22 కోట్ల ట్రూ అప్ మొత్తాన్ని వసూలు చేసేందుకు అనుమతించింది. ఇందులో వ్యవసాయేతర వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్లు వసూలు చేయనుండగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ.2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

నవంబర్ నెల విద్యుత్ బిల్లుల్లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) పరిధిలో 29 బిల్లింగ్ నెలలు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో 26 బిల్లింగ్ నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

 

● పాత వినియోగమే ప్రస్తుత బిల్లుకు ఆధారం

ట్రూ అప్ ఛార్జీల లెక్కింపు ప్రస్తుత నెలలో వినియోగించిన విద్యుత్ ఆధారంగా జరగడం లేదు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో సంబంధిత విద్యుత్ సర్వీస్ కనెక్షన్‌పై నమోదైన వార్షిక వినియోగంలో 1/12 వంతును నెలవారీ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తాలను బిల్లులో విడివిడిగా చూపించాలని TGERC ఆదేశించింది.

సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఒక ఇంట్లో 2022-23, 2023-24 కాలంలో ఒక అద్దెదారుడు నివసించి, అధిక విద్యుత్ వినియోగించి ఖాళీ చేసి వెళ్లిపోయి ఉండవచ్చు. అదే సర్వీస్ కనెక్షన్ కొనసాగుతూ కొత్త అద్దెదారుడు వచ్చినా, పాత కాలపు వినియోగం ఆధారంగా ట్రూ అప్ ఛార్జీలు ప్రస్తుత బిల్లులో కనిపించే పరిస్థితి ఉంది. దీంతో అప్పట్లో విద్యుత్ వినియోగించిన వ్యక్తికి బదులుగా ప్రస్తుతం నివసిస్తున్న అద్దెదారుడిపై భారం పడుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

 

● వాణిజ్య సముదాయాల్లోనూ ఇదే సమస్య

ఇదే పరిస్థితి అద్దె షాపుల్లోనూ నెలకొంది. గతంలో ఒక వ్యాపారి నిర్వహించిన దుకాణంలో నమోదైన విద్యుత్ వినియోగం ఆధారంగా ప్రస్తుతం అదే కనెక్షన్‌పై వ్యాపారం చేస్తున్న వ్యక్తికి అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. దీంతో పాత అద్దెదారుడు వాడిన విద్యుత్‌కు కొత్తగా వచ్చిన వ్యాపారి ఎందుకు చెల్లించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గృహజ్యోతి పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారుల ట్రూ అప్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరించనుంది. దీంతో వారికి ఈ అదనపు భారం నుంచి ఊరట లభించనుంది.

ట్రూ అప్ వసూళ్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు, అద్దెదారులు మారినప్పుడు పాత వినియోగానికి సంబంధించిన బాధ్యతను ఎలా నిర్ణయించాలనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ కనెక్షన్ పేరు మార్పు, కొత్త అద్దెదారుడు ప్రవేశించిన సందర్భాల్లో పాత వినియోగానికి సంబంధించిన ఛార్జీలను ఎవరు చెల్లించాలనే అంశంపై డిస్కంలు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

విద్యుత్ బిల్లుల్లో ట్రూ అప్ వివరాలను విడిగా చూపించడంతో పాటు, పాత వినియోగానికి సంబంధించిన బాధ్యతను ప్రస్తుత వినియోగదారుడిపై మోపకుండా తగిన విధానం రూపొందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టత ఇవ్వకపోతే అద్దె ఇళ్లు, వాణిజ్య సముదాయాల్లో వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

#Sidhumaroju

Alwal