రామగిరి ఖిల్లాను సందర్శించిన సినీ హీరో అక్కినేని నాగచైతన్య.. సినిమా షూటింగ్‌కు అనువైన ప్రదేశాల పరిశీలన!

0
3

రామగిరి మండలంలోని చారిత్రక రామగిరి ఖిల్లాను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య సందర్శించినట్లు సమాచారం. ఓ సినిమా షూటింగ్‌కు అనువైన ప్రదేశాల ఎంపికలో భాగంగా ఆయన రామగిరి ఖిల్లాను పరిశీలించినట్లు తెలుస్తోంది.ఇటీవల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగిరి ఖిల్లాలో ట్రెక్కింగ్ చేపట్టిన సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలు విదేశీ ప్రాంతాలను తలపించేలా ఉన్నాయని, సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రదేశమని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరగడంతో ఈ ప్రాంతం ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ ప్రచారం జరిగిన కొద్ది రోజులకే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగచైతన్య రామగిరి ఖిల్లాను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో చారిత్రక, ప్రకృతి సౌందర్యానికి నిలయమైన రామగిరి ఖిల్లాకు మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్‌లకు రామగిరి ఖిల్లా వేదికగా మారితే పెద్దపల్లి జిల్లా పర్యాటక రంగానికి కొత్త ఊపుతో పాటు స్థానిక ప్రాంతానికి మరింత ప్రచారం లభించనుంది.