AITUC 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి : మేకల దాసు

0
5

మంచిర్యాల: ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) 43వ జాతీయ మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని AITUC మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంచిర్యాలలోని CPI కార్యాలయంలో AITUC 43వ జాతీయ మహాసభల పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు.అనంతరం మేకల దాసు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కార్మికులు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులకు విఘాతం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు.శ్రీరాముడి నామస్మరణ చేస్తూ రామరాజ్యం గురించి మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు సైతం కల్పించకపోవడం ఏ విధమైన రామరాజ్యమని ప్రశ్నించారు.ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, NHM ఉద్యోగులు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, మిషన్ భగీరథ ఉద్యోగులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కుల పరిరక్షణ, కనీస వేతనాల అమలు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు తదితర కీలక అంశాలపై జాతీయ మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్తు కార్మిక ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, AITUC 43వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని మేకల దాసు కోరారు.ఈ కార్యక్రమంలో AITUC జిల్లా ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు, కొమురయ్య, ఆర్. వెంకన్న, అరుణ, కాంత కృష్ణ, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.