శ్రీరాంపూర్, నవంబర్ 19: సింగరేణి కార్మికులు, ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించి, అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్, INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 వద్ద నిర్వహించిన కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాప్యం చేయడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో యాజమాన్యం జాప్యం చేయడం విచారకరమని విమర్శించారు.ఈ సందర్భంగా కార్మికుల ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ ఏడు కీలక డిమాండ్లను ఆయన ముందుంచారు.234 మంది అర్హులకు కారుణ్య నియామకాలు: అన్ని ప్రక్రియలు పూర్తయినప్పటికీ నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న 234 మంది అర్హులైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగ నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.NCWA ఉద్యోగులకు PERKSపై ఆదాయపు పన్ను మినహాయింపు: సింగరేణి ఎగ్జిక్యూటివ్‌లు, కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులకు వర్తిస్తున్న PERKSపై ఆదాయపు పన్ను మినహాయింపును NCWA ఉద్యోగులకు కూడా సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఓవర్మన్ల ప్రమోషన్లు: గతంలో ప్రకటించిన నిర్ణయాలను అమలు చేయకుండా ప్రమోషన్ల ప్రక్రియను పెండింగ్‌లో ఉంచడం తగదని, అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని అన్నారు.
అలియాస్ పేర్ల సమస్యలు: ఉద్యోగుల సర్వీస్ రికార్డులు, వ్యక్తిగత వివరాల్లో ఉన్న అలియాస్ పేర్లు, పేర్ల వ్యత్యాసాలకు సంబంధించిన పెండింగ్ కేసులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ప్రతి నెలా మెడికల్ బోర్డు: కార్మికులు, ఉద్యోగుల వైద్య సమస్యల పరిష్కారానికి ప్రతినెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని, వైద్యపరంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్హులకు నిబంధనల ప్రకారం అన్‌ఫిట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు.ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ: ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.డిస్మిస్ కార్మికులకు వన్‌టైమ్ సెటిల్మెంట్: విధుల నుంచి డిస్మిస్ అయిన కార్మికులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ విధానం ద్వారా మరో అవకాశం కల్పించాలని INTUC కోరుతోందని తెలిపారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రకటన చేసినప్పటికీ, సింగరేణి యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్ కార్మికులకు పూర్తి న్యాయం చేసేలా లేదని విమర్శించారు. ఆ సర్క్యులర్‌లోని లోపాలను సరిదిద్ది, అర్హులైన డిస్మిస్ కార్మికులందరికీ న్యాయం జరిగేలా సమగ్ర ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలపై INTUC తరఫున పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ యాజమాన్యం ఆశించిన స్థాయిలో స్పందించకపోవడంపై డా. జనక్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో జాప్యం చేయడం కార్మికుల పట్ల యాజమాన్యానికి ఉన్న నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోందని అన్నారు.
కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల హక్కుల పరిరక్షణే INTUC ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, కార్మికులను తప్పుదోవ పట్టించే కంటి తుడుపు చర్యలను మానుకోవాలని యాజమాన్యానికి హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేసి, పెండింగ్ సమస్యలపై ఎలాంటి జాప్యం లేకుండా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం పిట్ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ సమ్మయ్య, జనరల్ సెక్రటరీ జీవన్ జోయల్, నాయకులు ల్యాగాల శ్రీనివాస్, చాట్ల అశోక్, శీలం చిన్నయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, INTUC నాయకులు పాల్గొన్నారు.










