సంత లక్ష్మీపురం సర్పంచ్ బరిలో అన్నెపు కైలాస్ రావు.. అభివృద్ధే ప్రధాన అజెండా!

0
6

 

మెలియాపుట్టి: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సంత లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అన్నెపు కైలాస్ రావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం గ్రామ పెద్దలు, యువత, మద్దతుదారులతో కలిసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల బరిలోకి దిగినట్లు వెల్లడించారు. ఎం.ఎస్సీ., బి.ఎడ్. విద్యార్హతలు కలిగిన తాను గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు శుద్ధమైన తాగునీరు అందించడం, రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడం, పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.

సంత లక్ష్మీపురం, గుడ్డిబద్ర, గంగన్నపేట, గణేపేట, టకోయి, గాతలవలస గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తానన్నారు.

గ్రామ పాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం అవసరమని కైలాస్ రావు అభిప్రాయపడ్డారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగిన అన్నెపు కైలాస్ రావు ప్రకటించిన ప్రణాళికలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.