ఇల్లు, దుకాణం దగ్ధం.. రూ.10 వేల ఆర్థిక చేయూత
నౌపడ: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఉద్దానం అభ్యుదయ సేవా సమితి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ ప్రమాదంలో ఇల్లు, దుకాణం కోల్పోయిన సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన కర్రీ నాగరాజుకు సమితి సభ్యులు రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు.
ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో నాగరాజుకు చెందిన దుకాణంతో పాటు, అదే భవనంలో నివాసం ఉంటున్న ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంట్లో దాచుకున్న నగదుతో సహా రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. రోజువారీ జీవనమే భారంగా ఉన్న కుటుంబం ఈ ప్రమాదంతో తీవ్ర ఇబ్బందుల్లో పడింది.
విషయం తెలుసుకున్న ఉద్దానం అభ్యుదయ సేవా సమితి వ్యవస్థాపకుడు తామాడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో సభ్యులు శనివారం బాధితుడి ఇంటికి చేరుకుని పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.10 వేల నగదు ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ సమితి ప్రధాన లక్ష్యమని తామాడ లక్ష్మణరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి ఇన్చార్జిలు మండల మహేష్, గుంటు విజయ్ బ్రదర్స్, కొండవేటి చెన్నకేశవరావు, గీత నీలకంఠం, మండల ఈశ్వరరావు, చింత దానేష్, దండుపాటి పవన్ కుమార్, కోళ్ల కృష్ణారావు, దండుపాటి సంతోష్ కుమార్, అనపాన రాజశేఖర్, సుంకర రాణి, బై హిమావతి, గణగళ్ల ఉమా, బాలక సౌదామణి తదితరులు పాల్గొన్నారు.









