● గుండెపోటుతో ఎన్టీవీ రిపోర్టర్ కన్నుమూత
● కపటం తెలియని మనిషి.. కల్మషం లేని మనసు
● ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలిచిన జర్నలిస్టు
● నీతో గడిపిన జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి
అల్వాల్, నవంబర్ 23: అల్వాల్‌లో ఎన్టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న అమర్ ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కపటం తెలియని మనిషి.. కల్మషం లేని మనసు అమర్ సొంతం. జర్నలిస్టుగా ఎన్నో సమాచారాలను సేకరిస్తూ ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి. వృత్తిపట్ల అంకితభావంతో తనదైన శైలిలో పనిచేసే అమర్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది.
నీతో కలిసి గడిపిన రోజులు, మన మధ్య జరిగిన సంభాషణలు, పంచుకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను. నిన్నటి వరకు నాతో ఉన్న నువ్వు.. ఈరోజు లేవన్న నిజాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది.
అమర్.. నీ గురించి ఒక వార్త రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిత్యం వార్తల సేకరణలో, సమాచారాన్ని అందించడంలో నీతో కలిసి సాగిన ప్రయాణాన్ని మరచిపోలేను. నీ గురించి ఇప్పుడు రాయాల్సి రావడం మనసును కలచివేస్తోంది. నిజంగా ఏం రాయాలో.. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు.
అమర్ అంటేనే చిరంజీవి.. మరణం లేనివాడు అని అర్థం. కానీ నీ పేరుకు భిన్నంగా నువ్వు ఇలా అర్ధాంతరంగా దూరమవుతావని అనుకోలేదు. నీ గురించి రాయడానికి అక్షరాలు ఉన్నా.. మనసులోని బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు.
నీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని, నీ కుటుంబానికి ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
అమర్.. నువ్వు భౌతికంగా దూరమైనా నీ మంచితనం, నీతో ఉన్న అనుబంధం, మనం కలిసి గడిపిన క్షణాలు నా జ్ఞాపకాలలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.
నీ పేరు అమర్.. నీ జ్ఞాపకాలు కూడా అమరమే!
#సిద్దు మారోజు ✍️









