● దోమల బెడద నివారణకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి
● సాయినగర్ కమ్యూనిటీ హాల్ మరమ్మతులు, పారిశుధ్య సమస్యల పరిష్కారంపై వినతి
● వెంకటరమణ కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరిన మాజీ కార్పొరేటర్
అల్వాల్, నవంబర్ 23: ఆయా కాలనీల్లో నెలకొన్న పలు పౌర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జోనల్ కమిషనర్ సంచిత్‌ను కలిసి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సాజిద్, మహేందర్‌లతో కలిసి జోనల్ కమిషనర్‌ను కలిసిన ఆమె పలు కీలక సమస్యలను వివరించారు.
కొత్త చెరువు, చిన్నరాయుని చెరువుల్లో గుర్రపుడెక్క విపరీతంగా పెరగడంతో పరిసర కాలనీల ప్రజలు దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పును నివారించేందుకు తక్షణమే గుర్రపుడెక్కను తొలగించి, అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
అలాగే సాయినగర్ కాలనీ కమ్యూనిటీ హాల్ పైకప్పు స్లాబ్ దెబ్బతిన్నందున ప్రజల భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పరిసర కాలనీల్లో పారిశుధ్య సమస్యలను పరిష్కరించి, క్రమం తప్పకుండా శుభ్రత పనులు చేపట్టాలని కోరారు.
వెంకటరమణ కాలనీలో ప్రజల ఆరోగ్యం, వ్యాయామ సౌకర్యం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని జోనల్ కమిషనర్‌ను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తావించిన అన్ని సమస్యలపై తక్షణమే స్పందించి, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
#Sidhumaroju
Alwal










