కలం నుంచి ప్రజాసేవలోకి.. 18వ వార్డు కౌన్సిలర్‌గా నాగార్జున

0
2

కూటమి ఆధిక్యంలోనూ వైసీపీ తరఫున విజయం.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చెరుకుపల్లి నాగార్జున ప్రమాణస్వీకారం

పలాస (కాశీబుగ్గ): ఇన్నాళ్లూ పాత్రికేయుడిగా ప్రజా సమస్యలపై తన కలంతో గళమెత్తిన చెరుకుపల్లి నాగార్జున (నేతాజీ) ఇకపై ప్రజాప్రతినిధిగా సేవలందించనున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్‌గా ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో అధికారులు ఆయనతో ప్రమాణం చేయించారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 36 వార్డులకు గాను 32 వార్డుల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థులు విజయం సాధించగా, వైసీపీ తరఫున నలుగురు అభ్యర్థులు గెలుపొందారు. వారిలో 18వ వార్డు నుంచి చెరుకుపల్లి నాగార్జున విజయం సాధించడం విశేషంగా నిలిచింది.

పాత్రికేయుడి నుంచి ప్రజాప్రతినిధిగా..

సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో కొనసాగిన నాగార్జున పలాస జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ వచ్చిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణస్వీకారంతో స్థానిక పాత్రికేయ వర్గాల్లో ఆనందం వ్యక్తమైంది. పలువురు జర్నలిస్టులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తనపై నమ్మకంతో గెలిపించిన 18వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. వార్డులో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు సమగ్ర అభివృద్ధికి అంకితమవుతానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, 18వ వార్డు ప్రజలు పాల్గొని నాగార్జునకు శుభాకాంక్షలు తెలిపారు.