● అల్వాల్‌లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏసీపీ శంకర్ రాజు
● 150 హెల్మెట్ల విరాళంతో అందుబాటులోకి ఉచిత సేవలు
● తీసుకున్న హెల్మెట్‌ను 24 గంటల్లో తిరిగి ఇవ్వాలి
అల్వాల్, 24: రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తిరుమలగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ జి. శంకర్ రాజు ప్రత్యేక చొరవ చూపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి తక్షణ రక్షణ కల్పించే ఉద్దేశంతో అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐజీ విగ్రహం వద్ద మంగళవారం హెల్మెట్ బ్యాంకును ప్రారంభించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పిస్తే ఉచితంగా హెల్మెట్ అందజేస్తారు. దానిని 24 గంటల్లోగా తిరిగి పోలీసులకు అప్పగించాలి. ఈలోగా సొంతంగా హెల్మెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. తిరిగి వచ్చిన హెల్మెట్‌ను ఇతర వాహనదారులకు అందజేస్తారు.
ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రాజు మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కాకుండా రక్షణ పొందవచ్చని, ప్రాణాపాయ పరిస్థితులను నివారించవచ్చని పేర్కొన్నారు. జరిమానా భయంతో కాకుండా ప్రాణాల విలువను గుర్తించి ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
హెల్మెట్ బ్యాంకు నిర్వహణకు వాల్యూ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 150 హెల్మెట్లను విరాళంగా అందించింది. సంస్థ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ అంజని, ప్రతినిధి నితిన్‌కు అల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జి. పవన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మూడు నెలల క్రితం గోపాలపురం, బేగంపేట, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రారంభించిన హెల్మెట్ బ్యాంకులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, అదే స్ఫూర్తితో అల్వాల్‌లోనూ ఈ సేవలను విస్తరించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో అల్వాల్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ జి. జనకిరాములు, బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె. శ్రీనివాసులు, అదనపు ఇన్స్పెక్టర్ డి. ప్రమోద్ కుమార్, తిరుమలగిరి ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు ఐఎస్ఐ గుర్తింపు కలిగిన హెల్మెట్లు ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju
Alwal










