ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎస్పీ క్షేత్రస్థాయి పర్యటన

0
0

• బ్లాక్ స్పాట్లపై నిరంతర నిఘా ఉండాలి: జిల్లా ఎస్పీ నితికా పంత్

• కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాల పరిశీలన

🎤కుమురం భీమ్ ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాగజ్‌నగర్ పట్టణం, కాగజ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఆసిఫాబాద్ హెల్మెట్ చౌరస్తాలో ఉన్న ప్రమాదకర బ్లాక్ స్పాట్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని ఈఎస్ఐ టర్నింగ్, బట్టుపల్లి చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, రాజీవ్ నగర్ బోర్డు, కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్, ఆసిఫాబాద్ హెల్మెట్ చౌరస్తా తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడ ప్రమాదాలకు గల కారణాలను క్షుణ్ణంగా సమీక్షించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు ప్రమాదాలు జరగకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనదారులు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ కుమార్, సీఐలు ప్రేమ్ కుమార్, సంజయ్, ఎస్సైలు వెంకటకృష్ణ, సంధ్యారాణి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.