తెలంగాణ నేపథ్యంతో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి? కథలో దమ్ము లేదా? దర్శకుల ఆలోచనా విధానంలో లోపమా?

0
2

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల కథలే ఎక్కువగా కనిపించేవి. అందులో తెలంగాణ యాసను కేవలం ఒక కమెడియన్ పాత్రకో, విలన్ పాత్రకో పరిమితం చేస్తూ కొన్ని పదాలు ఉపయోగించేవారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి నటులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు టాలీవుడ్‌లో పెద్దగా కనిపించకపోవడం కూడా అందుకు ఒక కారణం.

కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారాయి. తెలంగాణ నుంచి ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు ఘన విజయాలు సాధించి, తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త గుర్తింపును సంపాదించాయి.

దీంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాతలు, దర్శకులు సైతం తెలంగాణ కథాంశాలపై ఆసక్తి చూపించడం ప్రారంభించారు. తెలంగాణ నేటివిటీ, యాస, సంస్కృతి, జీవన విధానం సినిమాలకు మంచి మార్కెట్‌ను సృష్టించాయి.

అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది!

తెలంగాణ నేపథ్యంలో సినిమా తీస్తున్న కొందరు దర్శకులు, ఏదో కొత్తగా చూపించాలనే ఆలోచనతో కథలో బలం లేకపోయినా నిర్మాతలతో భారీ బడ్జెట్లు పెట్టిస్తున్నారు. కథకు అవసరం ఉన్నా లేకపోయినా హింసను, రక్తపాతాన్ని విచ్చలవిడిగా చూపిస్తున్నారు.

సినిమా విడుదలకు ముందు భారీ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఆ వేదికలపై సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, పాటల రచయితలు, గాయకులు ఇలా ప్రతి ఒక్కరినీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, మీరే తోపు, మీకు మీరే సాటి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఆ పొగడ్తలు వింటూ సినిమా బృందం ఆ రాత్రంతా విజయోత్సాహంలో మునిగిపోతుంటే… తెల్లవారేసరికి సినిమా విడుదలైన మొదటి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వస్తోంది.

ఇటీవల విడుదలైన ‘పారడైజ్’, ‘భోగి’ వంటి సినిమాల విషయంలోనూ ప్రేక్షకుల స్పందనపై చర్చ జరుగుతోంది. విడుదలకు ముందు జరిగిన ప్రచారానికి, విడుదల తర్వాత వచ్చిన టాక్‌కు మధ్య ఉన్న వ్యత్యాసం సినీ పరిశ్రమ ఆలోచించాల్సిన విషయం.

సినిమా విడుదలకు ముందు పొగిడినవారు, విడుదల తర్వాత సినిమా ఫలితం తేడాగా వచ్చినప్పుడు ఎక్కడా కనిపించరు. కానీ కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన నిర్మాత మాత్రం నష్టాన్ని భరించాల్సి వస్తుంది.

అసలు కథలో దమ్ము లేకుండా నిర్మాతలు కోట్ల రూపాయల బడ్జెట్ ఎలా పెడుతున్నారు? అనేది అర్థం కాని ప్రశ్న.

కేవలం కత్తులు పట్టుకుని నలుగురిని నరికిన సన్నివేశాలు, విచ్చలవిడిగా రక్తపాతం చూపిస్తేనే ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా? హింసను పదేపదే చూపించడం మాత్రమే గొప్ప కంటెంట్ అవుతుందా? ఇప్పటికే చూసిన కథలనే మళ్లీ మళ్లీ కొత్త పేర్లతో ప్రేక్షకుల మీద రుద్దడం ఎందుకు?

అసలు తెలుగు సినిమా నిర్మాతలకు మంచి కథలు దొరకడం లేదా? లేక మంచి కథలు చెప్పే కొత్త రచయితలకు, దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి మనసు రావడం లేదా?

వాస్తవానికి ఎంతోమంది అప్‌కమింగ్ రచయితలు, దర్శకులు అద్భుతమైన కథలతో ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తమలోని ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వారికి నిర్మాతల దగ్గరకు వెళ్లే అవకాశం కూడా దొరకడం లేదు.

ఒకవేళ నిర్మాతలు కొత్తవారితో సినిమా చేయాలని ఆసక్తి చూపించినా, వారి చుట్టూ ఉండే కొందరు భజనపరులు నిర్మాతల ఆలోచనలను మార్చి, మళ్లీ పాత దర్శకులకే అవకాశాలు వచ్చేలా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరోవైపు దుల్కర్ సల్మాన్ వంటి నటులు మంచి కథలను ఎంపిక చేసుకుంటూ, తక్కువ బడ్జెట్‌లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కానీ మన దగ్గర మాత్రం భారీ బడ్జెట్లు, కత్తులు, రక్తపాతం, భారీ ప్రచారాలకే ప్రాధాన్యత ఇస్తూ బాక్సాఫీస్ వద్ద పరాజయాలను ఎదుర్కొంటున్న సినిమాలు కనిపిస్తున్నాయి.

ఇకనైనా తెలుగు సినిమా నిర్మాతలు మారాలి!

కథకు ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త రచయితలకు, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వండి. వారి దగ్గర ఉన్న కథలను వినండి. కథ నచ్చితే చిన్న బడ్జెట్‌తో సినిమా ప్రారంభించండి. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులే ఆ సినిమాను విజయవంతం చేస్తారు.

ఒక నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి తిరిగి రావాలంటే ముందుగా కథపై నమ్మకం ఉండాలి. స్టార్‌డమ్, భారీ ఈవెంట్లు, పొగడ్తలు సినిమాను విజయవంతం చేయలేవు. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేది కథ మాత్రమే!

లేదంటే పాత దర్శకులు, అదే హీరోలు, అదే హీరోయిన్లు, అదే భజన బృందాలతో సినిమాలు తీస్తూ పోతే నిర్మాతలను ఆర్థిక నష్టాల నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు!

గుర్తుంచుకోండి… సినిమా బడ్జెట్‌ను పెంచేది స్టార్‌డమ్ కావచ్చు. కానీ ఆ సినిమాను నిలబెట్టేది మాత్రం కథలోని దమ్ము!

✍️ శ్రీను రావు పొన్నాల

అప్‌కమింగ్ రైటర్ & డైరెక్టర్