బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా :కార్మిక హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జయలక్ష్మి పిలుపునిచ్చారు.
బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘ భవనంలో కామ్రేడ్ గోమాస ప్రకాష్ అధ్యక్షతన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) మంచిర్యాల జిల్లా వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్ జయలక్ష్మి మాట్లాడుతూ, భారత కార్మికవర్గం గత శతాబ్ద కాలంగా అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
కార్మికుల హక్కులను కాలరాస్తూ, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని అన్నారు. వాటి అమలుకు అవసరమైన నిబంధనలను సైతం ఆమోదింపజేసుకుందని పేర్కొన్నారు. కార్మికుల భద్రతకు ముప్పు కలిగించే విధంగా కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సరళీకరణ విధానాలను అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచే చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
అంగన్వాడీ, ఆశా, ఐకేపీ వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఆర్పీలు, సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్ మిషన్, ఉపాధి హామీ, 108, 104, అర్బన్ హెల్త్ తదితర రంగాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్ల సమస్యలను ఆమె ప్రస్తావించారు. దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ వీరిని కార్మికులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ వంటి హక్కులు అమలు కావడం లేదని అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, కార్మిక హక్కుల రక్షణ కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో అన్ని రంగాల కార్మికులు భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికవర్గంపై పడుతున్న ప్రభావం, వివిధ రంగాల్లో కార్మికులు సాగిస్తున్న పోరాటాలు, సాధించిన విజయాలు, ఐక్య ఉద్యమాలపై జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు రోజుల పాటు వందలాది మంది ప్రతినిధులకు వసతి, భోజన సదుపాయాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కార్మికులు, శ్రేయోభిలాషులు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. అఖిల భారత జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని కోరింది.
ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాజారెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అల్లి రాజేందర్, చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు సమ్మక్క, జిల్లా సహాయ కార్యదర్శులు దాగం రాజారాం, సాంబారి వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్, సబిత, అంగన్వాడీ జిల్లా కార్యదర్శి రాజమణి, మున్సిపల్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్, అరుంధతి, మహేశ్వరి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.









