ఆసిఫాబాద్, నవంబర్ 28 (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించి, ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.
ఆసిఫాబాద్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల సంఖ్యను ఖచ్చితంగా గుర్తించాలని, వాటి సంరక్షణ కోసం కోసిని శివారులో ప్రత్యేక ఆశ్రయ కేంద్రాలు (షెల్టర్లు) ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల వద్ద వీధి కుక్కల సంచారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే, షెల్టర్లకు తరలించిన కుక్కలకు నిబంధనల ప్రకారం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్) నిర్వహించి, వాటి సంతతి పెరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.










