లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు: విపక్షాలపై చంద్రబాబు ఆగ్రహం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. 2029 ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది పెద్ద అడ్డంకిగా మారింది.
ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయ దురుద్దేశంతోనే బిల్లును అడ్డుకున్నాయని, ఇది మహిళలకు చేసిన చారిత్రక ద్రోహమని విమర్శించారు. మహిళా సాధికారతకు అడ్డుపడిన వారిని దేశం ఎన్నటికీ క్షమించదని ఆయన హెచ్చరించారు.










