స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు సమీక్ష: పారిశుద్ధ్య నిర్వహణకు పక్కా ప్రణాళిక
రాష్ట్రాన్ని ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, సేకరించిన వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో తడి, పొడి చెత్త నిర్వహణపై ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలని సీఎం స్పష్టం చేశారు. పచ్చదనం పెంపుతో పాటు సోలార్ రూఫ్‌టాప్స్, ‘నెట్ జీరో’ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










