హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) కార్యదర్శి పదవి ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు ఒక పరీక్షగా మారింది. ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేందుకు అధికారులు విముఖత చూపుతుండటంతో గురుకులాల పాలన కుంటుపడుతోంది.
గత ఏడాది కాలంగా సాగుతున్న బదిలీలు, సెలవుల పరంపర చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.
గురుకులాల్లో కేంద్రీకృత టెండర్ల నిర్వహణ, ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) బాధ్యతలు చూసుకోవాల్సిన కీలకమైన కార్యదర్శి పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారిణి విజయేందిర బోయి, పదవి చేపట్టిన వారం తిరగకముందే సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది.
ఆమె స్థానంలో అదనపు బాధ్యతలు తీసుకున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య కూడా వెంటనే సెలవు పెట్టడంతో, గిరిజన గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మికి ఈ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆమె గడువు కూడా ఈ నెల 15తో ముగియడంతో ప్రస్తుతం సొసైటీకి పూర్తిస్థాయి నాథుడే కరువయ్యారు.
1986 నుంచి ఇప్పటివరకు సుమారు 58 మంది అధికారులు ఈ పోస్టులో పని చేయగా, కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 30 మంది అధికారులు మారుతూ రావడం గమనార్హం. ఒక అధికారి 4 రోజులు, మరొకరు 10 రోజులు, ఇంకొకరు 14 రోజులు మాత్రమే పని చేసి వెళ్లిపోవడం ఈ పదవి పట్ల అధికారుల్లో ఉన్న అసంతృప్తిని తెలియజేస్తోంది.
వందల కోట్ల రూపాయల విలువైన టెండర్లు, కేంద్రీకృత కొనుగోళ్లు, రాజకీయ ఒత్తిళ్లు లేదా పాలనాపరమైన చిక్కులే ఇందుకు కారణమని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కీలకమైన ఫైళ్లు పెండింగ్‌లో ఉండటంతో పాటు, విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో కార్యదర్శి లేకపోవడం గురుకుల విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పోస్టులో ఒక సమర్థవంతమైన అధికారిని శాశ్వత ప్రాతిపదికన నియమించి, వ్యవస్థను గాడిలో పెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
#sidhumaroju










