రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన దివ్యకు సన్మానం
బైపీసీ కోర్సులో 990 మార్కులతో రాష్ట్రంలో మూడో స్థానం
నందిగామ: ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సులో అత్యధిక మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచిన పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తేజ జూనియర్ కళాశాల విద్యార్థిని కొండపల్లి దివ్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సౌమ్య బుధవారం ఘనంగా సన్మానించారు.
దివ్య 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకుంది. పదో తరగతిలో కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన దివ్య, ఇంటర్మీడియట్‌లో కూడా తన ప్రతిభను కొనసాగిస్తూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడం విశేషం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య దివ్యకు శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.










