కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ – పెట్టబోయే పేరు ఇదేనా..?

0
5

తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రానుంది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ పార్టీకి… ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

‎మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉద్యమకారులను పెద్ద సంఖ్యలోఈ సభకు ఆహ్వానించారని తెలుస్తోంది.

‎పార్టీ పేరు ఇదేనా…?

‎పార్టీ పేరుపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఓ దశగా టీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే తాజాగా పార్టీ ఆవిర్భావ వేదిక జరిగే మునీరాబాద్ ప్రాంతంలో ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ (TPVS) పేరుతో కొన్ని బ్యానర్లు, ఫ్లెక్సీలు కనిపించాయి. దీంతో ఈ పేరుతోనే ఆమె పార్టీని ప్రకటిస్తారన్న చర్చ జోరందుకుంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ…. దాదాపుగా ఇదే పేరు ఉండొచ్చని తెలుస్తోంది.

‎తెలంగాణ అస్థిత్వమే పునాదిగా, అభివృద్ధి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ పార్టీ పని చేయనుందని కవిత చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా తెలంగాణను మరింత ముందుకు తీసుకువెళ్లడమే తమ ఉద్దేశమని అంటున్నారు. కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేలా పార్టీ కార్యక్రమాలు ఉంటాయని ఇటీవలే కాలంలో చెప్పారు.కొత్త పార్టీ ప్రధానంగా తెలంగాణ రైతాంగం, నిరుద్యోగ యువత, మరియు మహిళా సాధికారతపై దృష్టి పెట్టనుంది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటూనే…. సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడం కోసం పార్టీ పని చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ జెండాను, పూర్తిస్థాయి విధివిధానాలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు

‎నియోజకవర్గాల వారీగా బలమైన కేడర్‌ను నిర్మించేందుకు ఇప్పటికే కవిత తన మద్దతుదారులతో చర్చలు జరిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి సమీకరణాలకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

‎కవిత పెట్టబోయే కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు? బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వెళ్తారు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇటీవలనే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కవితను కలిశారు.జాగృతి కండువాను కప్పుకున్నారు. ఈ లిస్టులో ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఉద్యమ కారులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు వివిద పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిదులు చెబుతున్నారు