దక్షిణాది రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అదే ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన ఈ ఉచిత ప్రయాణ హామీ, ఇప్పుడు మ్యానిఫెస్టోల్లో తిరుగులేని ‘మాస్టర్ స్ట్రోక్’గా మారింది. ఇప్పటికే మూడు ప్రధాన రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ పథకం, సోమవారం వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరిన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ‘మహాలక్ష్మి’ పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. 2026 ఫిబ్రవరి నాటికి సుమారు 273 కోట్ల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు దాదాపు రూ. 10,000 కోట్ల వరకు ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణ శాతం 40% నుంచి ఏకంగా 67%కి పెరగడం ఈ పథకం విజయానికి నిదర్శనం.









