నేపాల్‌ దాకా వేట.. జూబ్లీహిల్స్ హంతకులకు సంకెళ్లు.|

0
2

● నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలో నలుగురు కీలక సభ్యుల అరెస్ట్‌

● ఎనిమిది రాష్ట్రాల్లో గాలింపు.. భారత్‌–నేపాల్ సరిహద్దుల్లో సుదీర్ఘ నిఘా

● నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుల పట్టివేత

● ఇంటి పనివారి వివరాల ధ్రువీకరణపై సీపీ సజ్జనార్ సూచనలు

అల్వాల్,అక్టోబర్26:హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి రాయ్ వినయ్ రంజన్ భార్య తనుజా రంజన్ హత్య, దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. నేపాల్‌కు చెందిన అంతర్జాతీయ ముఠాలోని నలుగురు కీలక సభ్యులను సోమవారం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. వారి నుంచి రూ.51,130 నగదుతో పాటు నేరానికి సంబంధించిన ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మే 7, 8 తేదీల మధ్య రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాసన్ నగర్‌లో ఈ హత్య జరిగింది. తనుజా రంజన్ బెడ్‌రూమ్‌లో చేతులు, కాళ్లు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కిన స్థితిలో మృతిచెంది కనిపించారు. ఇంట్లోని బీరువాలను ధ్వంసం చేసిన దుండగులు సుమారు 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించారు. బాధితురాలి ఇంట్లో పనిచేసిన నేపాల్‌కు చెందిన ధర్మ తిరువా అలియాస్ కల్పన ముఠాకు సహకరించి, కుటుంబ సభ్యుల కదలికలు, ఇంట్లోని విలువైన వస్తువుల వివరాలను చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మే 19న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షణలో, ఐటీ సెల్ ఇన్‌స్పెక్టర్ జి.ఎస్. డానియల్ శాంతి కుమార్ నేతృత్వంలో బృందం దర్యాప్తు చేపట్టింది. జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఈ ఆపరేషన్‌లో భాగస్వాములయ్యారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచార వనరుల సాయంతో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, బిహార్, ఉత్తరాఖండ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో నిందితుల ఆచూకీ కోసం గాలించారు. భారత్‌–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోనూ నిఘా కొనసాగిస్తూ, రెండు నెలలకు పైగా నేపాల్‌లో మకాం వేసి వారి కదలికలను పర్యవేక్షించారు. చివరకు నిందితులు హైదరాబాద్‌కు చేరుకున్నట్లు గుర్తించి, నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వలపన్ని పట్టుకున్నారు.

ఈ ఆపరేషన్‌లో ధర్మ తిరువా అలియాస్ కల్పన (26), గణేష్ బి.కె. అలియాస్ గణేష్ బిశ్వకర్మ (31), చంద్ర బహదూర్ తమంగ్ (44), గణేష్ బహదూర్ షాహి (37)లను అరెస్టు చేశారు. వీరంతా నేపాల్‌కు చెందినవారు. ఈ కేసులో గతంలో మే 22న సునీల్ బహదూర్ ఆజి అలియాస్ సునీల్ పరియార్, దిలీప్ బహదూర్ మిజార్ అలియాస్ సోనార్‌లను అరెస్టు చేసి, వారి నుంచి 26 గ్రాముల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తాజా ఆపరేషన్‌లో నేపాల్‌కు చెందిన పరారీలో ఉన్న నేరస్థులపై ఐదు నాన్‌ బెయిలబుల్ వారెంట్లను అమలు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎనిమిది చోరీ కేసులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవన్ చంద్ అలియాస్ జీబన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇళ్లలో పనిమనుషులు, వంటవారు, వాచ్‌మెన్లు, సంరక్షకులను నియమించుకునే ముందు వారి గుర్తింపు పత్రాలు, నివాసం, గత ఉద్యోగ చరిత్ర, వ్యక్తిగత సూచనలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సీపీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఇందుకోసం పోలీసులు ఉచితంగా అందిస్తున్న వెరిఫికేషన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా అపార్ట్‌మెంట్ సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాహకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు, లాకర్ల వివరాలు, కుటుంబ సభ్యుల ప్రయాణ ప్రణాళికలు వంటి సున్నితమైన సమాచారాన్ని పనివారితో సహా అనవసర వ్యక్తులతో పంచుకోకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని, హైదరాబాద్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ 94906 16555కు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. ప్రజల అప్రమత్తత, పోలీసులకు సకాలంలో సమాచారం అందించడం నేరాల నివారణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

#Sidhumaroju

Alwal