“దేశవ్యాప్తంగా సంచలనం.. NEET 2026 పరీక్ష రద్దు.|

0
3

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన NEET-UG 2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ప్రకటించింది.

మే 3, 2026న నిర్వహించిన ఈ పరీక్షలో రాజస్థాన్ రాష్ట్రంలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి రావడంతో ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కేంద్ర దర్యాప్తు సంస్థ CBIతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రాజస్థాన్‌లోని కొన్ని కోచింగ్ సెంటర్ల ద్వారా పరీక్షకు 48 గంటల ముందే విద్యార్థులకు అందించిన “ప్రాక్టీస్ పేపర్”లోని ప్రశ్నలు అసలు NEET ప్రశ్నపత్రంతో భారీగా సరిపోలినట్లు దర్యాప్తులో గుర్తించారు.

దాదాపు 140 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్‌లో ఉండటంతో, సుమారు 600 మార్కులకు సమానమైన ప్రశ్నలు ముందుగానే కొందరికి చేరినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వ్యవహారం బయటపడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై ఇప్పటికే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) విచారణ ప్రారంభించింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఫోన్లు, డిజిటల్ చాట్లు, కోచింగ్ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

లీక్ వ్యవహారం రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి ఉండొచ్చని కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

NTA విడుదల చేసిన ప్రకటనలో పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఇందుకు విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల వివరాలను త్వరలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని తెలిపింది. అలాగే పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మే 3న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

పరీక్ష రద్దు నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు జాతీయ స్థాయి పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

#Sidhumaroju