హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) కిరణ్ నందిత, స్టేషన్ రైటర్ (కానిస్టేబుల్) బి. విజయ్ కుమార్ రూ. 30,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ప్రేమ వివాహం చేసుకున్న పాత బోయిన్‌పల్లికి చెందిన అభిషేక్ అనే యువకుడిపై అతని తండ్రి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదైంది.
ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన అభిషేక్, కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాల్సి ఉంది.
అయితే, ఈ బెయిల్ షరతులను సడలించేందుకు, కేసు ముగిసే వరకు పోలీసుల సహకారం అందించేందుకు ఎస్సై నందిత, రైటర్ విజయ్ కలిసి లంచం డిమాండ్ చేశారు.
ఇందుకోసం కానిస్టేబుల్ విజయ్ కుమార్ గతంలోనే బాధితుడి నుండి రూ. 10,000 వసూలు చేయగా, మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని ఎస్సై నందిత తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
స్టేషన్‌లో ఉన్నతాధికారులతో పాటు అందరికీ వాటాలు ఇవ్వాలంటూ, డబ్బులు ఇస్తేనే కేసు మేనేజ్ చేస్తానని నందిత స్పష్టం చేయడంతో విసిగిపోయిన బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఏసీబీ డీఎస్పీ చలసాని శ్రీధర్ పర్యవేక్షణలో సిటీ రేంజ్-2 అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు.
ఎస్సై నందిత ఆదేశాల మేరకు బాధితుడు అభిషేక్ లంచం డబ్బును పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసి ఉన్న ఆమె హోండా యాక్టివా స్కూటర్ డిక్కీలో ఉంచాడు.
ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడి చేసి, స్కూటర్ డిక్కీ నుండి రూ. 30,000 రసాయనాలతో కూడిన నోట్లను స్వాధీనం చేసుకుని ఎస్సై నందితను, కానిస్టేబుల్ విజయ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (CI)తో పాటు మరికొంత మంది సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా విచారించగా, వారి ప్రమేయం ఏమీ లేదని స్పష్టమైంది.
అనంతరం మహిళా ఎస్సై నందిత వ్యక్తిగత క్యాబిన్‌తో పాటు ఆమెకు సంబంధించిన సేవా పత్రాలు, డైరీలు, ఇతర కీలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ అవినీతికి పాల్పడిన ఇద్దరు పోలీసు అధికారులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా 1064 అనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju










