పవన్‌ను టార్గెట్ చేస్తే ఇక సహించేది లేదు: సీఎం చంద్రబాబు|

0
0

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం చేస్తున్న కుట్రలను ఇకపై సహించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. కర్నూలు జిల్లా జొన్నగిరి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి చిన్న ఘటనకు కులం రంగు పులుముతూ సమాజంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడి పవిత్రతను దెబ్బతీశారని, ఆ పాపాలు బయటపడటంతోనే ఇప్పుడు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షం గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తూ యువతను నాశనం చేస్తోందని ఆరోపించారు. రాయలసీమ ప్రాజెక్టులను గాలికొదిలేశారని విమర్శించిన సీఎం, తమ ప్రభుత్వం తుంగభద్ర గేట్ల ఏర్పాటు వంటి చర్యలతో ప్రజల పక్షాన నిలబడిందని, ఇకపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను ధీటుగా తిప్పికొడతామని స్పష్టం చేశారు.